Reviews

అఖండ

Click here to watch

అఖండ


         
Download

అఖండ

Related Articles

చిత్రం :  ‘అఖండ’

నటీనటులు: బాలకృష్ణ-ప్రగ్యా జైశ్వాల్-శ్రీకాంత్-జగపతిబాబు-నితిన్ మెహతా-పూర్ణ-కాలకేయ ప్రభాకర్-అయ్యప్ప పి.శర్మ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను

సింహా.. లెజెండ్ తర్వాత నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘అఖండ’. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

మురళీ కృష్ణ (బాలకృష్ణ) అనంతపురంలో పేరుమోసిన రైతు. ఫ్యాక్షనిస్టులు.. వాళ్ల దగ్గర పని చేసే వాళ్లందరినీ దారిలోకి తెచ్చి వారు తమ కష్టాన్ని నమ్ముకుని బతికేలా చేస్తాడు. సొంతంగా ఆసుపత్రులు స్కూళ్లు నడుపుతూ  అతడంటే ఆ ప్రాంత ప్రజలందరికీ అభిమానం. అనంతపురం జిల్లాకు కొత్తగా కలెక్టరుగా వచ్చిన శరణ్య.. మురళీ కృష్ణ మంచి పనులు చూసి అతడితో ప్రేమలో పడిపోతుంది. అతనూ ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరికీ పెళ్లయి ఓ పాప కూడా పుడుతుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో వీరున్న ప్రాంతంలో ఒక్కసారిగా పిల్లలందరూ అనారోగ్యం పాలవుతారు. అందుక్కారణం వరదరాజులు (శ్రీకాంత్) అనే రౌడీ మైనింగ్ పేరుతో చేస్తున్న యురేనియం దందా అని మురళీ కృష్ణకు తెలుస్తుంది. అతడిని ఎదిరించడంతో మురళీ కృష్ణతో పాటు అతడి కుటుంబమంతా ప్రమాదంలో పడుతుంది. ఆ నిస్సహాయ స్థితిలో ఈ కుటుంబాన్ని అఘోరా అయిన అఖండ ఆదుకుంటాడు. ఇంతకీ ఈ అఖండ ఎవరు.. మురళీ కృష్ణ కుటుంబంతో అతడికి సంబంధమేంటి.. అతడికి వరదరాజులు జరిగిన పోరాటం ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికేం జరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

బాలకృష్ణ-బోయపాటి.. నందమూరి అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే కలయిక ఇది. ఈ కాంబినేషన్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది హీరో ఎలివేషన్లు.. భారీ యాక్షన్ ఘట్టాలు.. మాస్ డైలాగ్స్. వాళ్లిద్దరి గత చిత్రాల్లో కూడా హైలైట్ అయినవి అవే. ఐతే అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతాయని సినిమా అంతా అవే నింపేస్తే..? హీరో కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో అదే పనిగా ఎలివేషన్ ఇస్తే..? ప్రతి యాక్షన్ ఘట్టాన్నీ ఒక క్లైమాక్స్ లాగా తీర్చిదిద్దితే..? పంచ్ డైలాగులతో మోత మోగించేస్తే..? కథ గురించి పట్టించుకోకుండా ఈ ఎలివేషన్లు.. యాక్షన్ సీక్వెన్సులు.. పంచ్ డైలాగుల మోతతోనే సినిమా నడిచిపోతే..? అఖండ సినిమాలో ఇదే జరిగింది. ఫ్యాన్స్.. మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలకు ఇందులో ఎంతమాత్రం లోటు లేదు. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి శుభం కార్డు పడే వరకు ఊర మాస్ స్టయిల్లో సాగే సన్నివేశాలు అభిమానుల కడుపు నింపేస్తాయి. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తాయి. కానీ కథాకథనాల పరంగా మాత్రం ‘అఖండ’ నిరాశకు గురి చేస్తుంది.

బోయపాటి చివరగా తీసిన ‘వినయ విధేయ రామ’ లాగానో.. బాలయ్య లాస్ట్ మూవీ ‘రూలర్’ తరహాలోనో ‘అఖండ’ భరించలేని సినిమా కాదు. కానీ వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సింహా లెజెండ్ సినిమాల స్థాయిని మాత్రం ఇది అందుకోలేదు. ఎలివేషన్ల విషయంలో ‘సింహా’.. ‘లెజెండ్’లను మించిపోయిన ‘అఖండ’.. వాటిలా ఎమోషన్ మాత్రం పండించలేకపోయింది. ‘సింహా’తో పోలిస్తే ‘లెజెండ్’కు డిఫరెంట్ రూట్లో వెళ్లిన బోయపాటి.. ఈసారి లెజెండ్ ఫార్ములాను డిట్టో ఫాలో అయిపోవడంతో.. ఇక్కడ కథ పరంగా ఎక్కడా ఎగ్జైట్మెంట్ అన్నదే లేకపోయింది. అందులో మాదిరే ఇక్కడా బాలయ్యది ద్విపాత్రాభినయం. యంగ్ బాలయ్యతో కథను మొదలుపెట్టి.. ఇంటర్వెల్ సమయానికి అతను నిస్సహాయుడిగా మారిన సమయంలో ఇంకో బాలయ్యను భారీ ఎలివేషన్ తో రంగంలోకి దించి.. ఇక ద్వితీయార్ధమంతా ఆ పాత్ర మీదే కథను నడపడంతో ‘అఖండ’ కథలో ఏ కొత్తదనం కనిపించదు. కాకపోతే రెండో పాత్రను అఘోరాగా చూపించడంతో దాని చుట్టూ ఉన్న సెటప్.. అలాగే బాలయ్య గెటప్ భిన్నంగా అనిపిస్తాయి. ఐతే ఆరంభంలో కొంచెం ప్రత్యేకంగా అనిపించే ఆ పాత్ర కూడా తర్వాత సాధారణంగా మారిపోతుంది. శూలం పట్టి విలన్లను చీల్చి చెండాడడం.. అక్కడక్కడా ప్రవచనాలు వల్లించడం తప్పితే ఈ పాత్ర కొత్తగా చేసిందేమీ లేదు.

బోయపాటి సినిమాలంటే మామూలుగా అత్యంత క్రూరమైన విలన్.. అతడి అరాచకాలకు అల్లాడిపోయే జనం.. ఎవ్వరూ ఆ విలన్ కు ఎదురు వెళ్లలేని స్థితిలో హీరో వచ్చి వీర లెవెల్లో విజృంభించడం… చివరికి ఇద్దరి మధ్య పోరులో హీరో గెలవడం.. ఇది కామన్ థ్రెడ్. ‘అఖండ’ కూడా అందుకు మినహాయింపు కాదు. మెయిన్ విలన్ తో హీరోకు ఘర్షణ మొదలవడానికి ముందు హీరో పరిచయం.. హీరోయిన్ తో ప్రేమాయణం మీద ఓ 40 కథను నడిపించాడు బోయపాటి. ‘అఖండ’లో వీకెస్ట్ పార్ట్ ఇదే. బాలయ్య ఇంట్రో సీన్ అభిమానులు మెచ్చేలాగే ఉన్నప్పటికీ.. కలెక్టరుగా ప్రగ్యా జైశ్వాల్ పాత్ర చాలా కృత్రిమంగా ఉండటంతో ఆమె.. బాలయ్య కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలన్నీ తేలిపోయాయి. అసలు హీరోయిన్ని కలెక్టరుగా ఎందుకు చూపించారో అర్థం కాదు. ఆమె హీరో చేసే ప్రతి పనికీ ఆశ్చర్యపోయి చూడటం.. తెగ ఇంప్రెస్ అయిపోవడం.. ఆయన ప్రేమలో పడిపోవడం సిల్లీగా అనిపిస్తుంది. మధ్యలో ‘జై బాలయ్యా’ పాట కొంత హై ఇచ్చినా.. ఈ ట్రాక్ మొత్తం తేలిపోయింది. విలన్ గా శ్రీకాంత్ ఎంట్రీ ఆ పాత్రపై అంచనాలను పెంచినా.. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ గ్రాఫ్ కూడా పడిపోతూ వస్తుంది. బాలయ్య-శ్రీకాంత్ ఫేస్ ఆఫ్ సీన్ తో ‘అఖండ’ మళ్లీ గాడిన పడ్డట్లు కనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ దగ్గర అఖండ రంగప్రవేశం చేసే ఎపిసోడ్ బాలయ్య మాస్ కు పూనకాలు తెప్పించేలా తీర్చిదిద్దాడు బోయపాటి. ‘లెజెండ్’ ఇంటర్వెల్ బ్లాక్ కు ఏమాత్రం తగ్గని స్థాయిలో దీన్ని తీర్చిదిద్దాడు.

అఖండ అనేది అఘోరా పాత్ర కావడంతో ద్వితీయార్ధంలో బోయపాటి అఖండ పాత్రకు సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏమైనా చూపించి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడేమో అనుకుంటే అలాంటిదేమీ జరగదు. విలన్ల మీద దశల వారీగా దాడులు చేయడం తప్పితే ఈ పాత్ర చేసేదేమీ ఉండదు. ఇది ఫాంటసీ సినిమానా.. సోషల్ మూవీనా అని అర్థం అని అయోమయంలోకి నెట్టేలా అఖండ పాత్రను విచిత్రంగా తీర్చిదిద్దారు. కొన్నిసార్లు ఆ పాత్రకు అతీంద్రయ శక్తులున్నట్లు చూపిస్తారు. కొన్నిసార్లు ఆ పాత్ర మామూలుగానే కనిపిస్తుంది. అసలు అఖండ అన్ని రోజులు ఎక్కడున్నాడో.. ఏం చేశాడో.. ఉన్నట్లుండి ఎందుకిలా ఊడిపడ్డాడో అర్థం కాదు. అఘోరా పాత్ర కాబట్టి దాని ద్వారా వైవిధ్యం చూపించడానికి అవకాశమున్నా బోయపాటి ఆ ప్రయత్నమే చేయలేదు. అతడితో వీర లెవెల్లో విధ్వంసం చేయిస్తూ ద్వితీయార్ధాన్ని లాగించేశాడు. మధ్యలో దేవాలయాల ప్రాధాన్యం గురించి.. హిందుత్వం గురించి లెక్చర్లు దంచే సన్నివేశాలు పెట్టారు. వాటి వల్ల కథకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. మరీ మోతాదు మించిన స్లో మోషన్ షాట్లు.. ఎలివేషన్లు.. ఫైట్లతో ద్వితీయార్ధంలో మొహం మొత్తేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ద్వితీయార్ధంలో ఎక్కడా కలగదు. ఈ కథ ఎలా ముగియబోతుందో ముందే ఒక అంచనా వచ్చేశాక అఖండ విధ్వంసాన్ని చూస్తూ శుభం కార్డు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. ప్రతి యాక్షన్ ఘట్టమూ క్లైమాక్స్ లాగే ఉండటంతో పతాక సన్నివేశం మీద ప్రత్యేక ఆసక్తేమీ కలగదు. బాలయ్య మాస్ పెర్ఫామెన్స్.. తమన్ మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల సెకండాఫ్ లో చాలా సన్నివేశాలు పాసైపోయాయి కానీ లేకుంటే కష్టమయ్యేదే. సినిమా మొత్తంలో హీరో ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాలే హైలైట్ అయ్యాయి తప్ప ‘అఖండ’లో అంతకుమించి ప్రత్యేకతలైతే కనిపించవు.

నటీనటులు:

బోయపాటి సినిమాలో బాలయ్య ఎలా కనిపించాలని అభిమానులు కోరుకుంటారో అలాగే కనిపించాడు బాలయ్య. రెండు పాత్రల్లోనూ ఆయన లుక్.. ఎనర్జీ.. మాస్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అఖండ పాత్రలో బాలయ్య పెర్ఫామెన్స్ స్టాండౌట్ గా నిలుస్తుంది. ఆ పాత్రలో ఇంకెవరినీ ఊహించుకోలేనట్లుగా బాలయ్య అదరగొట్టాడు. ద్వితీయార్ధాన్ని ఒంటి చేత్తో నడిపించాడు బాలయ్య. ఇంకో పాత్రలో హీరోయిన్ కలయికలో వచ్చే సన్నివేశాల్లో బాలయ్య కొంచెం ఇబ్బంది పడ్డాడు.. పెట్టాడు. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు. ఆమె ప్రతిదానికీ ఆశ్చర్యంతోనో.. భయంతోనో చూస్తూ కనిపించడం తప్ప చేసిందేమీ లేదు. కలెక్టర్ అంటూ పెద్ద బిల్డప్ తో ఆ పాత్రను పరిచయం చేసి తర్వాత తేల్చిపడేశారు. కొన్ని చోట్ల ప్రగ్యా హావభావాలు చికాకు పెడతాయి. ప్రగ్యా కంటే పూర్ణ బెటర్. విలన్ పాత్రలో శ్రీకాంత్ ఓకే అనిపించాడు. కానీ ఆ పాత్రది కూడా ఆరంభ శూరత్వమే. మధ్యలోనే అది ప్రాధాన్యం కోల్పోయింది. మరో విలన్ నితిన్ మెహతా బాగానే చేశాడు. స్వామీజీ పాత్రకు జగపతిబాబు అంతగా సూటవ్వలేదు. అయ్యప్ప పి.శర్మ కాసేపే కనిపించినా ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం:

‘అఖండ’ సినిమాకు నిస్సందేహంగా తమన్ పెద్ద బలం. మాస్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా అతను బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. హీరో ఎలివేషన్ సీన్లకు.. యాక్షణ్ ఘట్టాలకు అతను మామూలు ఆర్ఆర్ ఇవ్వలేదు. అఖండ పాత్ర రంగప్రవేశం తర్వాత అయితే తమన్ నేపథ్య సంగీతంతో ఒక యజ్ఞమే చేశాడు. చెవుల తుప్పు వదిలిపోయేలా బ్యాగ్రౌండ్ స్కోర్ తో మోత మోగించేశాడతను. తమన్ స్కోర్ తీసేసి చూస్తే కచ్చితంగా చాలా సన్నివేశాలు తేలిపోయేవే. భమ్ అఖండ పాటతో ఆడిటోరియాన్ని హోరెత్తించేశాడతను. జై బాలయ్య పాట కూడా ఓకే. అడిగా అడిగా.. పర్వాలేదు. కెమెరామన్ సి.రామ్ ప్రసాద్ గ్రాండ్ విజువల్స్ తో మెప్పించాడు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదు. సినిమా అంతటా భారీతనం కనిపిస్తుంది. రత్నం మాటలు మాస్ ను మెప్పించేలా సాగాయి. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను విషయానికొస్తే.. అతను బాలయ్యను అభిమానులు కోరుకునేలా చూపించాడు. ఎలివేషన్ సీన్లలో.. యాక్షన్ ఘట్టాల్లో తన బలాన్ని చూపించాడు. కానీ కథ పరంగా అతను వైవిధ్యం చూపించలేకపోయాడు. ‘వినయ విధేయ రామ’లో మాదిరి లాజిక్ లెస్ గా.. సిల్లీగా సినిమా తీయలేదు కానీ.. కొత్తగా మాత్రం చేసిందేమీ లేదు. ఒక టెంప్లేట్లో సినిమా తీసి సేఫ్ గేమ్ ఆడాడు.

చివరగా: అఖండ.. మాస్ మాస్ మాస్

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock