Reviews

గమనం

Click here to watch

గమనం


         
Download

గమనం

Related Articles

చిత్రం : ‘గమనం’

నటీనటులు: శ్రియ సరన్-శివ కందుకూరి-ప్రియాంక జవాల్కర్-చారుహాసన్-సుహాస్-సంజయ్ స్వరూప్-రవిప్రకాష్ తదితరులు
సంగీతం: ఇళయరాజా
ఛాయాగ్రహణం: రాజశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: రమేష్ కరుటూరి-వెంకి పుషాడపు-జ్ఞానశేఖర్ వీఎస్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుజనా రావు

కరోనా వల్ల చాలా ఆలస్యమై.. ఎట్టకేలకు రిలీజవుతున్న చిత్రం.. గమనం. శ్రియ ప్రధాన పాత్రలో కొత్త దర్శకురాలు సుజనారావు ఈ చిత్రాన్ని రూపొందించింది. ప్రోమోల్లో మంచి ఎమోషనల్ డ్రామాలాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దుబాయ్ వెళ్లిన భర్త కోసం ఎదురు చూస్తూ కష్టపడి తన పసిబిడ్డను పెంచుతున్న ఒంటరి మహిళ కమల (శ్రియ సరన్). ఇండియాకు ఆడాలన్న కలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతున్న యువ క్రికెటర్ (ఆలీ). తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా పెరుగుతూ.. ఏదో ఒక రోజు ఒక పెద్ద కేక్ కొనుక్కుని పుట్టిన రోజు జరుపుకోవాలన్న ఆశతో అందుకోసం కష్టపడుతున్న ఇద్దరు చిన్న కుర్రాళ్లు.. హైదరాబాద్ లో ఉండే వీళ్లందరి జీవితాలు భారీ వర్షాలు-వరదల కారణంగా ప్రభావితం అవుతాయి. ఈ పరిస్థితులను వాళ్లు ఏ విధంగా అధిగమించారు.. చివరికి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

వేర్వేరు వ్యక్తుల జీవితాలను సమాంతరంగా చూపిస్తూ.. ఒక పెద్ద సమస్యతో అందరినీ ఒక చోట చేర్చి.. ఆ సమస్య నుంచి బయటపడే క్రమంలో వారి జీవిత పరమార్థాన్ని తెలుసుకునేలా చేసే కథలు గతంలో కొన్ని చూశాం. ‘వేదం’ సహా తెలుగులో ఈ తరహాలో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. ఓటీటీల్లో వెబ్ సిరీస్ ల హవా మొదలయ్యాక ఈ టైపు కథల హవా మరింత పెరిగింది. ఐతే వీటన్నింట్లోనూ ‘ఎమోషన్’ అన్నది చాలా కీలకమైన విషయం. తెరపై కనిపించే వ్యక్తులతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వాళ్ల బాధలు చూసి కదిలిపోవాలి. వాళ్లు ఉపద్రవంలో చిక్కుకుంటే మనం విలవిలలాడిపోవాలి.

దాన్నుంచి బయటపడ్డపుడు మనసు తేలిక పడాలి. చివరగా ఒక రియలైజేషన్ వచ్చి.. కొన్నాళ్లు ఈ కథ మనల్ని వెంటాడాలి. అప్పుడే ఈ తరహా కథల సార్థకత వస్తుంది. వాటి ప్రయోజనం నెరవేరుతుంది. కానీ మనం చూస్తున్న పాత్రల్లో జీవం అన్నదే లేకుంటే.. ఏ రకంగానూ వాటితో మనం కనెక్ట్ కాలేకపోతే.. ఏ కోశాన ఎమోషన్ అన్నది పండకపోతే.. మొక్కుబడిగా ఈ కథల్ని నడిపించి ఒక పర్పస్ లేని ముగింపునిస్తే.. అది ‘గమనం’ సినిమా అవుతుంది.

‘గమనం’లో మూడు కథల్ని సమాంతరంగా చూపిస్తుంది దర్శకురాలు సుజనా రావు. అందులో శ్రియ సరన్ చుట్టూ తిరిగే ఒక్క కథతో మాత్రమే ప్రేక్షకులు అంతో ఇంతో కనెక్ట్ అవుతారు. అందుక్కారణం తాను చేసిన కమల పాత్రలో శ్రియ నటన ఆకట్టుకోవడం. భర్త దుబాయిలో ఉంటే అతడి కోసం ఎదురు చూస్తూ తన పసిబిడ్డను కష్టపడి పెంచే పాత్రలో శ్రియ ఉత్తమ నటన కనబరిచింది. పసిబిడ్డతో ఒంటరిగా ఓ మహిళ కష్టపడటం అనే పాయింట్ ఎవరినైనా కొంచెం కదిలించేదే. ఆ కోణంలో ఈ సెగ్మెంట్ కొంతమేర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఐతే ఆ కథలో కాస్తయినా కొత్తదనం ఉంటే బాగుండేది.

కానీ కమల పాత్ర పరిచయంతోనే దుబాయిలో ఉన్న భర్త తర్వాత ఏం చేయబోతున్నాడనే విషయం అర్థమైపోతుంది. తర్వాత అనుకున్నట్లే ఈ కథను మలుపు తిప్పడంతో ఆశ్చర్యమేమీ ఉండదు. కొన్ని చోట్ల తల్లీబిడ్డను చూసి అయ్యో అనుకుంటామే తప్ప ఇంకే రకమైన ఎమోషన్ కలగదు.

ఇక ‘గమనం’లో చూపించే మిగతా రెండు ఉపకథల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇండియాకు ఆడాలనుకునే ఔత్సాహిక ముస్లిం క్రికెటర్.. అతడి కుటుంబం.. తనకో ప్రేయసిని పెట్టి ఈ కథను నడిపించిన తీరు చూస్తే ఆరంభంలోనే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. ఇటు క్రికెట్ కెరీర్ కు సంబంధించి కొత్తగా ఏమీ చూపించరు. డెప్త్ అన్నదే ఉండదు. మరోవైపు ఫ్యామిలీ.. ప్రేమ సన్నివేశాలేమో మరీ బోరింగ్ గా అనిపిస్తాయి. ఈ పాత్ర కనిపించినపుడల్లా నిరుత్సాహం ఆవహిస్తుంది తప్ప ఇంకేమీ ఉండదు.

ఇక ఇద్దరు అనాథ పిల్లల చుట్టూ తిప్పిన ఇంకో కథ కూడా పేలవమే. బర్త్డే కేక్ కొనుక్కోవడం కోసం రూపాయి రూపాయి కూడబెట్టే ఆ పిల్లల వ్యవహారాన్ని ఒక కథగా రాసి పబ్లిష్ చేస్తే బాగుంటుందేమో కానీ.. తెరపైన మాత్రం ఇది పూర్తిగా తేలిపోయింది. మూడు కథలను కట్ చేసి కట్ చేసి ఏమాత్రం ఆసక్తి లేకుండా.. స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి మ్యాజిక్ లేకుండా చాలా బోరింగ్ గా నడిపించిన తీరు ఎంత విసిగిస్తుందంటే.. ఇంటర్వెల్ సమయానికే ఒక సినిమా చూసేసిన భావన కలుగుతుంది.

అసలేముందని ఈ కథను సినిమాగా తీశారో అర్థం కాని అయోమయం మధ్య ద్వితీయార్ధం ముందుకు నడుస్తుంది. వరదలు మొదలయ్యాక సన్నివేశాలైతే మరీ దారుణం. చూపించిన సీన్లనే మళ్లీ మళ్లీ చూపిస్తూ విపరీతమైన సాగతీతతో నడుస్తుంది ద్వితీయార్ధం. కథ అసలు ముందుకే కదలకుండా.. ఇంకెప్పుడు సినిమా ముగుస్తుందో అన్న నిరీక్షణలోకి వెళ్లిపోతాడు ప్రేక్షకుడు. మధ్యలో నిత్యా మీనన్ తో చిన్న షో ఏదో చేయించారు. అసలు ఆ ఎపిసోడ్ సినిమాలో ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఓపక్క జోరు వర్షం పడుతుంటే ఇద్దరు పిల్లలు మట్టి వినాయకుడి విగ్రహాలు పట్టుకుని అమ్మడానికి ప్రయత్నించడంలో లాజిక్ ఏంటో అంతుబట్టదు.

ఇలా సెంటిమెంటు పండిచడానికి ప్రయత్నించిన దర్శకురాలిని చూసి జాలి పడాలే తప్ప.. ఆ పిల్లల మీద అలాంటి భావన కలగదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్లుగా సన్నివేశాలు వచ్చి పోతుంటాయి. మూడు కథల్లో ఒకదాంతో మరోదానికి ఏ సంబంధం ఉండదు. దేనికది మొక్కుబడిగా సాగిపోయి.. చివరికి నిస్సారంగా ముగుస్తుంది. చివరికొచ్చేసరికి ఈ సినిమా పర్పస్ ఏంటో కూడా అర్థం కాదు.

నటీనటులు:

ఈ సినిమాకు ఏకైక ఆకర్షణ శ్రియ సరనే. కమల పాత్రలో ఆమె చాలా బాగా నటించింది. పాత్రలో బలం లేకపోయినా తన నటనతో ఆ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేసింది శ్రియ. తనకు మరిన్ని పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఇవ్వొచ్చని ఈ పాత్రతో ఆమె చాటిచెప్పింది. శివ కందుకూరి పాత్ర.. తన నటన చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఆ పాత్రలో ఏమాత్రం డెప్త్ లేదు. జారా ప్రియాంక జవాల్కర్ చేయడానికి ఏమీ లేకపోయింది. చారు హాసన్.. సుహాస్ బాగా చేశారు. సంజయ్ స్వరూప్.. రవిప్రకాష్ ఓకే. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారంటే నమ్మడం కష్టమే. ఆయన ముద్ర ఎక్కడా కనిపించదు. పాటల్లో ఎక్కడా ఆయన శైలి కనిపించదు. ఒక్క పాట కూడా మళ్లీ వినాలనిపించేలా లేదు. నేపథ్య సంగీతంలో మాత్రం కొన్ని చోట్ల మాస్ట్రో టచ్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అది కూడా ఆయన స్థాయిలో లేదు. సినిమా చూస్తూ ఆయన కూడా చాలా చోట్ల మొక్కుబడిగా లాగించేశారనిపిస్తుంది. ఈ సినిమాకు సహ నిర్మాత కూడా అయిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ కూడా తన స్థాయికి తగ్గ పనితనం చూపించలేకపోయాడు. నిర్మాణ విలువల్లో పాటించిన పొదుపు వల్ల కెమెరామన్ కూడా చాలా పరిమితుల మధ్య పని చేసిన విషయం అర్థమవుతుంది. క్రికెట్ సన్నివేశాల్లో విజువల్స్ మరీ పేలవం. వరద సన్నివేశాల్లో ఎక్కడా కూడా ఒరిజినల్ ఫీల్ తీసుకురాలేకపోయారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అక్కడక్కడా మెరిశాయి. ఐతే కథలో డెప్త్ లేకపోవడంతో ఆయన కూడా పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. దర్శకురాలు సుజనా రావు అన్ని రకాలుగా నిరాశ పరిచింది. కథ.. కథనం.. దర్శకత్వం.. అన్నింట్లోనూ ఆమె తేలిపోయింది.

చివరగా: మంద’గమనం’

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock